Monday, October 29, 2012

బొట్టు పుట్టుక


Thursday, July 7, 2011


బొట్టు పుట్టుక

హైందవ భారతీయ స్త్రీ ముఖారవిందాన్ని ఇనుమడింపజేసే అద్భుత నక్షత్రం బొట్టు

బొట్టు ఒక మంగళప్రదమెన ఆచారం. ఆత్మశక్తి సిద్ధాంతాన్ని నమ్మిన వారికి అది ‘మూడో కన్ను’.
కుంకుమ భక్తి ప్రపత్తికి సంధానమైతే, టిక్లీ (బొట్టు బిళ్ల) ఓ సౌందర్యపు మెరుపు.

తెలంగాణ ప్రజలకు తమదైన ‘కట్టు’ (వస్త్రధారణ) ఉన్నట్టే, ప్రత్యేకమైన బొట్టూ (తిలకం) ఉంది. ఇప్పుడు కాలం మారింది కాబట్టి, చాలామంది ఆడవారి నుదుటిపై రెడీమేడ్ బొట్టుబిల్లలే (టిక్లీలు) కనిపిస్తున్నాయి. కానీ, ఇదే సమయంలో రూపాయి బిళ్లంత పరిమాణంలో ఎర్ర కుంకుమ బొట్టుతో అమ్మవార్లలా దర్శనమిచ్చే గ్రామీణ, సాంప్రదాయిక మహిళలనూ మనం ఎందరినో చూస్తుంటాం.

జన జీవితంతో మమేకమైపోయిన ‘బొట్టు’ పుట్టుక నిన్న మొన్నటిది కాదు. కొన్ని శతాబ్దాల హిందూమతంతోపాటే ఈ ‘ఆచారమూ’ ఆవిర్భవించింది. ఈ ఆచారం ఎప్పుడు పుట్టిందీ నిర్దిష్టంగా చెప్పలేం. ముఖ్యంగా భారతదేశంలో ప్రాచీన సాహిత్యంలో ‘బొట్టు’ తాలూకు సందర్భాలు అనేకం ఉన్నాయి. 3వ, 4వ శతాబ్దానికి చెందిన గ్రంథాలలో ఆయా వ్యక్తుల బొమ్మలు బొట్టుతో ఉన్నట్టు తెలుస్తూంది. హిందువులలో కులాలు, వర్గాలకు అతీతంగా అందరూ బొట్టు పెట్టుకుంటారు.

కుంకుమను కుంకుమపువ్వుతో తయారుచేస్తారు. ఇరిడేసియా కుటుంబానికి చెందిన ‘క్రోకస్ సాటియస్’ జాతి పూలను ఎండబెట్టి చూర్ణం చేసి, కుంకుమ తయారుచేస్తారు. ఈ చెట్టును సంస్కృతంలో రక్త, కేసరి వంటి పలు పేర్లతో పిలుస్తారు.

నుదుటిమధ్య, కనుబొమల నడుమ ‘బొట్టు’ పెట్టుకునే ఈ సాంప్రదాయం ప్రపంచంలోనే అతి పురాతనమైంది. గత కొన్ని శతాబ్దాలుగా భారతీయ సమాజంపై సాగుతున్న పాశ్చాత్య సాంస్కృతిక దాడుల నేపథ్యంలోనూ ఇది చెక్కు చెదరక పోవడం గమనార్హం. బొట్టు పెట్టుకోవడమం ‘దేవుణ్ని’ ఆరాధిస్తున్నట్టు, గౌరవిస్తున్నట్టు లెక్క.

ఏ సంప్రదాయమైనా మనిషికి పుట్టుకతోనే రాదు. బొట్టు కూడా అంతే. చిన్న అలవాటుగా ప్రారంభమై, ఆచారంగా మారి, చివరకు ఒక సంప్రదాయమంత ఎత్తు ఎదిగింది. ఈ ప్రయాణం అనంతం. తరతరాలకూ అది విస్తరించింది. జాతి సంస్కృతిలో భాగమైంది. ఈ తరహా కొన్ని సంస్కృతులు ఎంత బలీయంగా నాటుకు పోతాయంటే యుగయుగాలైనా చెక్కుచెదరలేనంత. అలాంటి శక్తివంతమైన పవిత్ర ఆచారమే ‘తిలక ధారణ’.

వాస్తవానికి కట్టు- బొట్టు బాహ్య అలంకరణలే కావచ్చు. కానీ, సదరు వ్యక్తి లేదా సమాజం జీవనశైలిని అవి నిండుగా ప్రతిబింబిస్తాయి. నుదుట బొట్టు పెట్టుకునే సంప్రదాయం గత కొన్ని శతాబ్దాలుగా హైందవ సమాజానికి ఒక మకుటాయమానంగా భాసిల్లుతోంది. ఒక రకంగా బొట్టు మన అలంకరణలో భాగమైనా మత సంబంధ పవిత్ర కార్యంగానూ దీనిని విశ్వసిస్తాం. హిందూ సమాజానికి చెందిన దాదాపు ప్రతి ఒక్క మహిళా వయసుతో పనిలేకుండా, శిశువూపాయం నుండే ‘బొట్టు’కు అలవాటు పడుతుంది. లింగభేదంతో సంబంధం లేకుండా నెలల పసికందుకు సైతం వసివాడని పసి ఫాలభాగంలో చారెడంత ‘నల్ల బొట్టు’ పెడతారు. కళ్లకు కాటుక అద్దుతారు. అదే చేతితో చెంపకు కాటుక చుక్క దిద్దుతారు. దిష్టి తగలకుండా ఊదు వేస్తారు.

ఆడపిల్లలకైతే వయసుతో సంబంధం లేకుండా బొట్టు తప్పనిసరి. కొందరు మగవారు ప్రత్యేకించి, భగవద్ భక్తిపరులు ఒక సదాచారంగా దీనిని నిత్యం ఆచరిస్తారు. ప్రత్యేకించి పూజలు, శుభకార్యాలు ప్రారంభించే ముందు విధిగా ప్రతి ఒక్కరూ ఆడా మగా, చిన్నా పెద్దా తేడా లేకుండా నుదుటిపై కుంకుమ దిద్దుకున్నాకే దీపం వెలిగిస్తారు. దేవీ ఆరాధనలో కుంకుమపూజకు విశిష్ట స్థానం ఉంది. దైవసేవకు వినియోగించిన కుంకుమను నిత్యం ధరించడానికైతే చాలామంది ఆశపడతారు.

‘బొట్టు’ ఏదైనా ఒక పనికి ఆరంభసూచిక. బొట్టు పెట్టి చెబితే దానికి ‘సాధికారికత’ లభించినట్టే. బొట్టు పెట్టి ఆహ్వానిస్తే సదరు కార్యానికి ఆచారబద్ధత అబ్బినట్టు. బొట్టును అనేక విషయాలకు ప్రతీకగానూ హైందవులు భావిస్తారు. ఇదొక శుభ శకునం. సంతోషానికి, వికాసానికి, అదృష్టానికి, సంక్షేమానికి, సౌభాగ్యానికి, మొత్తం మీద సకల మంగళవూపదానికి ఇదొక శుభచిహ్నం.

హైందవ భారతీయ స్త్రీ ముఖారవిందాన్ని ఇనుమడింపజేసే అద్భుత నక్షత్రం బొట్టు. కుంకుమ భక్తి ప్రపత్తికి సంధానమైతే, టిక్లీ (బొట్టు స్టిక్కర్) ఓ సౌందర్యపు మెరుపు. వీటిలో ఎన్నో రకాలు. రంగు రంగులవి, రక రకాల డిజైన్లవి. సాంప్రదాయబద్ధమైనవి, ఆధునాతనమైనవి- నలుపు, సింధూర లేదా స్వర్ణ వర్ణం సర్వసాధారణం. విభూది నిరాడంబర జీవన తత్వానికి నిదర్శనం.

‘బొట్టు ధారణ’ తీరునుబట్టి ఆయా వ్యక్తుల భగవదారాధన సంప్రదాయాన్ని తెలుసుకోవచ్చు. శైవులు విభూదిని అడ్డంగా మూడు గీతలుగా నుదుటి నిండా పెట్టుకుని, నడుమ గంధంతో కుంకుమ బొట్టు ధరిస్తారు. వైష్ణవులు నుదుటిపై నిలువునా తిరుమణి కాపు-శ్రీచక్రం అలంకరించుకుంటారు. విభూది శంకరునికి- కుంకుమ పార్వతికి ప్రతీక అయితే, తిరుమణి కాపు విష్ణువుకు, శ్రీచక్రం లక్ష్మీదేవికి చిహ్నంగా ప్రజలు నమ్ముతారు. శైవ-విష్ణు బేధం లేని సర్వదేవతారాధకులంతా గుండ్రని కుంకుమతో తిలకాన్ని దేవికి, పరాశక్తి మాతకు ఆరాధనగా దిద్దుకుంటారు.

విభూదిలో క్యాల్షియం, ఉప్పు, కలప చూర్ణం ఉంటుంది. వేసవిలో భారతీయులను ఉష్ణతాపం నుండి ఈ విభూది కొంతవరకు చల్లబరుస్తుందని పండిత నిపుణులు అంటారు. చందనంలోనూ చల్లబరిచే గుణాలు ఉండటమేకాక అది మానసిక ప్రశాంతతనిస్తుందనీ చెబుతారు. సాధారణంగా నరసింహస్వామి, ఆంజనేయస్వామి ఉగ్రరూప విగ్రహాల నిండా చందనం పూస్తారు. దీని వెనుక చల్లబరిచే భావనే ఉన్నట్లు వారు చెప్తారు. అయితే, రసాయనాలతో తయారవుతున్న కొన్ని రకాల తిలకాలతో చర్మానికి ఇన్‌ఫెక్షన్ సోకుతోందన్న ఫిర్యాదులూ వినవస్తున్నాయి.

నుదుటిపై తిలకం ధరించని వ్యక్తిని పెద్దలు ‘నీరు లేని బావి’గా పోల్చారు. అలాగే, బావిలేని ఇల్లు, గుడిలేని ఊరు, నది లేని దేశం, నాయకుడు లేని సమాజం, పాలివ్వని ఆవు, పదును లేని కత్తి - ఇటువంటి వాటితో బొట్టు ధరించని వారిని పెద్దలు పోలుస్తారు. అయితే, ఈ రకమైన కట్టుబాట్లు, నియమాలను పట్టించుకోని వారూ కొందరుంటారు. హిందువులలోనే అత్యధికంగా మగవారు ఎల్లవేళలా తిలకధారణకు ఇష్టపడరు. కేవలం పూజా సమయాల్లోనే విధిగా ఆచరిస్తారు. పెళ్లిళ్లలో అయితే పెళ్లి బొట్టుకు విశిష్ట స్థానం ఉంటుంది. తెలంగాణలో ముత్తయిదువలు తోటి ముత్తయిదువలను పూజించే విధానం బాగా వ్యాప్తిలో ఉంది. ‘పసుపు బొట్టు’ పేర్న పిలిచే ఈ సంప్రదాయాన్ని (పేరంటం) కులభేదాలకు అతీతంగా జరుపుకుంటారు.

బొట్టును ‘బిందీ’ అంటారు. ‘బిందు’ అనే సంస్కృత పదం నుండి ‘బిందీ’ వచ్చింది. దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలైన భారత్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్‌లలో హైందవులైన ఆడవారు అందరూ ఎల్లవేళలా, మగవారు ఆయా సందర్భాలలో విధిగా బొట్టు ధరిస్తారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలోని హిందూజాతి వారు కూడా తిలకధారణ చేస్తారు. ఒక్కోసారి హైందవేతర మతస్థులు ఫేషన్‌కోసం ఆయా సందర్భాలలో రకరకాల డిజైన్లలో, రంగుల్లోని బొట్లు పెట్టుకోవడం చూస్తాం. ముఖ్యంగా-రష్యాలో ‘బిందీ’ ప్రసిద్ధిగాంచింది. స్టాలిన్ కుమార్తె స్వెట్లానా ఒక భారతీయ వ్యక్తిని వివాహమాడి నందున ఈ ఆచారం ప్రచారంలోకి వచ్చింది.

బొట్టు బిల్లలు గుండ్రని చుక్కలుగా, వజ్రాలుగా, బాకుల్లా, గీతలుగా వివిధ ఆకృతుల్లో ఉంటాయి. ఎరుపు, నలుపు వంటి పలు వర్ణాల్లోనూ లభిస్తాయి. మహిళలు తాము ధరించే వస్త్రాలకు మ్యాచింగ్ అయ్యేలా అనేక రంగుల్లో బిందీ (బొట్టుబిల్లలు)లు మార్కెట్లో దొరుకుతాయి. అయితే, ఇవన్నీ చాలావరకు స్టిక్కర్లుగానే ఉంటాయి. సంప్రదాయ సిద్ధమైన కుంకుమ రంగుల్లో తిలకాలూ ఉంటాయి. ద్రవ రూపంలోని వీటిని నుదుటికి పెయింట్ చేసుకుంటారు. ఆడపిల్లలు లేదా ముత్తయిదువలు ఇంటికి వచ్చి, తిరిగి వెళ్లేప్పుడు విధిగా గృహస్థులు వారి నుదుట బొట్టు పెడుతూ- ‘ఎప్పటికీ ఇలాగే రండి’ అని చెప్తారు. ఈ ఆచారం తెలంగాణలోనూ విస్తృతంగా వాడుకలో ఉంది.

‘‘సరిగ్గా నుదుటిపై బొట్టు పెట్టుకునే చోట... మనిషిలోని అతి ప్రధాన గ్రంథి కేంద్రీకృతమై ఉంటుంది. అదే మెదడులోని పైనియల్ గ్రంథి. వ్యక్తి మొత్తం పనితనాన్ని ఇదే క్రమబద్ధీ కరిస్తుంది. దీనినే ‘మూడో కన్ను’గా పిలుస్తున్నారు’’ అని ఆధ్యాత్మిక నిపుణులు అంటారు. ఆ చోట ధరించే కుంకుమ లేదా చందనం ఈ గ్రంథిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, తద్వారా మానసిక సమస్థితి వంటి పాజిటిక్ ఫలితం కలుగుతుందని వారు అభివూపాయ పడు తున్నారు. అలాగే, మహిళలు ధరించే రక్తం రంగులోని అమ్మవారు ఎర్ర కుంకుమ వారికి మనోధైర్యాన్నిస్తుందనీ చెప్తారు.

‘‘రెండు కనుబొమల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది. అందుకే తిలకాన్ని అక్కడ దిద్దాలి. ఈ అలంకర వల్ల అద్భుతమైన శీతలగుణం దేహానికి సిద్ధిస్తుంది’’ అని యోగులు వివరిస్తారు. ‘‘మనిషి శరీరంలో అంతర్గతంగా, స్థూలరూపంలో వివిధ శక్తి కేంద్రాలు కేంద్రీకృతమై ఉన్నాయి. వాటిని ప్రేరేపించడం ద్వారా అతనికి ఆత్మసాక్షాత్కారం కావడమే కాక మానవాతీత శక్తులూ అబ్బుతాయి. కనుబొమల మధ్య ఉన్నది ‘ఆరవ చక్రం’. ఇది శక్తి కేంద్రం. ‘ఆజ్ఞాచక్ర’మనీ దీనిని అంటారు. వ్యక్తి కూడగట్టుకున్న ఆధ్యాత్మిక శక్తి ఇక్కడే నిక్షిప్తమై, ఇక్కడ్నించే బహిర్గతమవుతుంది. కనుక, ఈ స్థానంలో ‘తిలకం’ దిద్దుకోవడం ద్వారా ఆజ్ఞాస్థానం బలోపేతమై, శక్తిని పుంజుకుంటుంది. సదరు వ్యక్తిని దుష్టశక్తులు తమ వశంలోకి తీసుకోకుండా, అతను లేదా ఆమె దురదృష్టం బారిన పడకుండా ‘బొట్టు’ ఒక జగద్రక్షగా నిలుస్తుంది’’ అని నిపుణులైన ఆధ్యాత్మికవేత్తలు వివరిస్తారు.

‘‘శివుడి భ్రుకుటిపై కనుబొమల మధ్య ‘మూడో కన్ను’ ఉంటుంది. అది మూసి ఉంటేనే లోకాలలోని దుష్టశక్తులన్నీ నశిస్తాయి. దానిని పరమేశ్వ రుడు ఎప్పుడూ తెరవడు. తెరిచే పరిస్థితి రాకూడదు. ఒకవేళ వస్తే... సకల లోకాలూ సర్వనాశనమవుతాయి. కాబట్టి, అక్కడ తిలకం దిద్దుకోవడం వల్ల బొట్టుకు ‘మూడోకన్ను’ అంతటి ప్రాధాన్యం లభించింది’’ అని హిందూ ప్రజలు నమ్ముతున్నారు. అందువల్లే హైందవులు విధిగా బొట్టును అలంకరించు కోవాలని మతశాస్త్రవేత్తలు చెబుతున్నారు.

1 comment: